Search This Blog

Tuesday, March 20, 2012

తెలుగు రాష్ట్రం


               ఆంధ్రులు వింధ్యపర్వత దక్షిణ భాగానికి తరలి వెళ్ళి, ద్రావిడులతో కలసిన ఆర్యులుగా క్రీ.పూ. 7వ శతాబ్దపు సంస్కృత రచనలు వర్ణిస్తున్నాయి. క్రీ. పూ. 5వ శతాబ్దములో ప్రతీపాలపురం (భట్టిప్రోలు) రాజధానిగా కుబేరక అను రాజు పాలన చేస్తున్నాడని ఆధారాలు దొరికాయి. మహావీరుడు, గౌతమ బుద్ధుడు ధాన్యకటకము (అమరావతి) సందర్శించారనడానికి ఆధారాలున్నాయి. మౌర్య చక్రవర్తి అశోకుని మరణానంతరం (క్రీ.పూ 232) ఆంధ్రులు వెలుగులోకి వచ్చారు. నవీన చరిత్రకారులు ఆంధ్రుల చరిత్ర ఆనాటినుండి మొదలైనట్లుగా లెక్కిస్తున్నారు. ఆంధ్ర (శాతవాహన), శక, పల్లవ, ఇక్ష్వాకు, తెలుగు చోళ, తూర్పు చాళుక్య, కాకతీయ, విజయనగర, కుతుబ్ షాహి, హైదరాబాదు నిజాం లు మొదలైన వంశాలకు చెందిన రాజులు ఆంధ్ర దేశాన్ని పరిపాలించారు. క్రీ.శ 17వ శతాబ్దములో బ్రిటీషు వారు కోస్తా ఆంధ్రను నిజామ్ వద్ద గెలుచుకొని మద్రాసు రాష్ట్రములో (మద్రాసు ప్రెసిడెన్సీ) కలుపుకున్నారు. హైదరాబాదు నిజామ్ బ్రిటిషు ఆధిక్యతను గుర్తించి తెలంగాణ ప్రాంతానికి పరిమితమైనాడు.

“అమరావతీ పట్టణమున బౌద్ధులు
విశ్వవిద్యాలయములు స్థాపించు నాఁడు
ఓరుగల్లున రాజవీర లాంఛనములుగాఁ
బలు శస్త్రశాలలు నిలుపునాఁడు
విద్యానగర రాజ వీధులఁ గవితకు
పెండ్లి పందిళ్ళు కప్పించు నాఁడు
పొట్నూరికి సమీపమున నాంధ్ర సామ్రాజ్య
దిగ్జయ స్తంభమెత్తించునాఁడు

ఆంధ్ర సంతతికే మహితాభిమాన
దివ్యదీక్షా సుఖస్పూర్తి తీవరించె
నా మహావేశ మర్ధించి యాంధ్రులార!
చల్లుఁడాంధ్ర లోకమున నక్షతలు నేఁడు!

                                                                                                                          -- రాయప్రోలు సుబ్బారావు

             అంధ్ర ప్రదేశ్ లేక తెలుగునాటి చరిత్ర తొలుత చరిత్ర పూర్వయుగము మరియు చారిత్రకయుగము అను రెండు భాగములుగా విభజింపవచ్చును. ఇందు చరిత్ర పూర్వయుగకథనానికి లిఖిత ఆధారాలు లభింపలేదు. ఇది క్రీస్తు పూర్వము మూడవ శతాబ్ది ఆరంభము వరకు కొనసాగిన ప్రాచీన కాలము. క్రీస్తు పూర్వము మూడవ శతాబ్దినుండి ఆధునికకాలము వరకు నడచినది చారిత్రక యుగము. ఈ యుగమును మరల సౌకర్యార్ధమై పూర్వయుగము, మధ్యయుగము మరియు ఆధునికయుగము అని మూడు భాగములుగా విభజింపవచ్చును. మధ్య యుగాన్ని మళ్ళీ పూర్వ మధ్య యుగం (కాకతీయుల కాలం) మరియు ఉత్తర మధ్య యుగం (విజయ నగర రాజ్య కాలం)గా విభజిస్తారు


తెలుగు జాతి

              ఒక జాతి అనేది ఒక్కమారుగా ఉద్భవించిన సమూహం కాదు. చరిత్రలో జరిగిన అనేక సాంఘిక, రాజకీయ, ఆర్ధిక, స్థానచలన, సాంస్కృతిక ఘటనల ద్వారా జాతులు రూపుదిద్దుకొన్నాయి. ఆంధ్రుల జాతీయతను గురించి లభించిన వివిధ (చాలా వరకు అస్పష్టమైన) ఆధారాల ద్వారా చరిత్రకారులు ఆంధ్రజాతి ఇలా ఏర్పడిందని భావిస్తున్నారు - నాగులు, ఆంధ్రులు, ద్రావిడులు, తెలుగులు, యక్షులు మరియు శబరులవంటి ఇతర వనవాస జాతులు కాలక్రమంలో వివిధ సంబంధాల ద్వారా, ప్రధానంగా భాషాపరంగా, కలసినందువలన ఆంధ్ర లేదా తెలుగు జాతి రూపుదిద్దుకొంది. వీరిలో నాగులు పంజాబు ప్రాంతంలో (క్రీ.పూ. 600 నాటికి) ఉండి ఆర్యులను ప్రతిఘటించారు. ఆంధ్రులు మహాభారత యుద్ధకాలంలో యమునా నదితీరాన ఉండేవారు. యుద్ధానంతరం నెలకొన్న రాజకీయ కల్లోలం వలనా, మిడతల దండు కారణంగా ఏర్పడిన ఆహార లోపం వలనా క్రమంగా దక్షిణాపధానికి వలస వచ్చారు. యక్షులు భట్టిప్రోలు ప్రాంతంలో తూర్పు తీరాన ఉండేవారు. కళింగులు, తెలుగులు ఉత్తర తీరాంధ్రంలో వ్యవసాయం, ఇతర వృత్తులలో నిపుణులైన స్థిరనివాస జాతి. ద్రవిడులు రాయలసీమ ప్రాంతంలో ఉండేవారు.

            క్రీ. పూ. 6వ శతాబ్దంలో ఉద్భవించిన బౌద్ధ, జైన మతాలకు ఆరంభ కాలంనుండి ఈ దక్షిణాపధంలో అనన్యమయన ఆదరణ లభించింది. బౌద్ధమతం బోధించిన వర్ణరహిత జీవనం ఈ జాతుల మధ్య సహజీవనానికీ, సమాగమనానికీ మరింత ఊపునిచ్చింది. ఆంధ్రులు యుద్ధ నిపుణులైనా గాని దండెత్తి వచ్చినవారుకారు. బ్రతుకు తెరువుకోసం వచ్చినవారు. అయితే అప్పటికే స్థిరనివాసం ఏర్పరచుకొన్న తెలుగుల భాష మరింత పరిపక్వత చెందిఉండాలి. కనుక తెలుగు భాష ఈ జాతుల ఏకీకరణకు మార్గం మరింత సుగమం చేసింది. రాజకీయ అధికారం ఆంధ్రులు సాధించినా భాష మాత్రం తెలుగే నిలిచింది. ఈ నేపధ్యంలోనే ఆంధ్రజాతి రూపు దిద్దుకొంది.


No comments:

Post a Comment