Search This Blog

Tuesday, March 20, 2012

తెలుగు సాహిత్యం




తెలుగు సాహిత్యము

తెలుగు సాహిత్యాన్ని ఆరు యుగాలుగా వర్గీకరించ వచ్చును. 

నన్నయకు ముందు కాలం - (క్రీ.శ. 1020 వరకు)

             11 వ శతాబ్దం ప్రాంతంలో నన్నయ రచించిన మహాభారతం తెలుగు లోని మొట్టమొదటి సాహిత్య కావ్యమని సర్వత్రా చెబుతారు. ఒక్కసారిగా ఇంత బృహత్తరమైన, పరిపక్వత గల కావ్యం రూపుదిద్దుకోవడం ఊహించరానిది. కనుక అంతకు ముందు చెప్పుకోదగిన సాహిత్యం ఉండి ఉండాలి. కాని అది బహుశా గ్రంథస్తం కాలేదు. లేదా మనకు లభించడం లేదు. అంతకు ముందు సాహిత్యం ఎక్కువగా జానపద సాహిత్యం రూపంలో ఉండి ఉండే అవకాశం ఉన్నది. కాని మనకు లభించే ఆధారాలు దాదాపు శూన్యం. క్రీ.శ. 575లో రేనాటి చోడుల శాసనం మొట్టమొదటి పూర్తి తెలుగు శాసనం. (కడప జిల్లా కమలాపురం తాలూకా ఎఱ్ఱగుడిపాడులో లభించినది). అంతకు ముందు కాలానికి చెందిన అమరావతీ శాసనంలో "నాగబు" అనే పదం కన్పిస్తుంది.

పురాణ యుగము - ( క్రీ.శ.1020 - క్రీ.శ.1400)

            దీనిని నన్నయ్య యుగము అన వచ్చును. నన్నయ్య ఆది కవి. ఇతడు మహా భారతాన్ని తెలుగులో వ్రాయప్రారంభించి, అందులో మొదటి రెండు పర్వాలు పూర్తి చేసి, తరువాతి పర్వాన్ని(అరణ్య పర్వం) సగం వ్రాసి కీర్తి శేషుడు అయ్యాడు. నన్నయకు నారాయణ భట్టు సహాయంగా నిలిచినాడు. నారాయణ భట్టు వాఙ్మయదురంధరుడు. అష్టభాషాకవి శేఖరుడు. సహాధ్యాయులైన నారాయణ, నన్నయ భట్టులు భారత యుద్ధానికి సంసిద్ధులైన కృష్ణార్జునులవలె భారతాంధ్రీకరణకు పూనుకొని ఒక విజ్ఞాన సర్వస్వంగా దానిని రూపొందించే ప్రయత్నం ప్రారంభించినారు; తెనుగు కావ్యభాషాస్వరూపానికి పూర్ణత్వం సాధించి,పండితులూ పామరులూ మెచ్చుకొనదగిన శైలిని రూపొందించి, తరువాతి కవులకు మార్గదర్శకులయ్యారు. ఆంధ్ర భాషా చరిత్రలో నన్నయ, నారాయణులు యుగపురుషులు.వీరు తెలుగు భాష కు ఒక మార్గాన్ని నిర్దేశించినారు. వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒక సారి అయినా నన్నయ్య గారి అడుగు జాడలను అనుసరించిన వారే.

              నన్నయ తరువాతికాలంలో ముఖ్యమైన సామాజిక, మత సంస్కరణలు చోటు చేసుకొన్నాయి. వీరశైవము, భక్తిమార్గము ప్రబలమై ఎన్నో కావ్యాలకు కారణమైనది. తిక్కన(13వ శతాబ్ది), ఎర్రన(14వ శతాబ్దం)లు భారతాంధ్రీకరణను కొనసాగించారు. నన్నయ చూపిన మార్గంలో ఎందరో కవులు పద్యకావ్యాలను మనకు అందించారు. ఇవి అధికంగా పురాణాలు ఆధారంగా వ్రాయబడ్డాయి.

మధ్య యుగము లేదా శ్రీనాథుని యుగము - (క్రీ.శ.1400 - క్రీ.శ.1510)

          ఈ కాలంలో సంస్కృతకావ్యాల, నాటకాల అనువాదం కొనసాగింది. కథాపరమైన కావ్యాలు కూడా వెలువడ్డాయి. "ప్రబంధము" అనే కావ్య ప్రక్రియ ఈ కాలంలోనే రూపు దిద్దుకున్నది. ఈ కాలంలో శ్రీనాథుడు, పోతన, జక్కన, గౌరన పేరెన్నిక గన్న కవులు. ఛందస్సు మరింత పరిణతి చెందింది. శ్రీనాథుని శృంగార నైషధము, పోతన భాగవతం, జక్కన విక్రమార్క చరిత్ర, తాళ్ళపాక తిమ్మక్క సుభద్రా కళ్యాణం మొదలైనవి ఈ యుగంలో కొన్ని ముఖ్యమైన కావ్యాలు. ఈ సందర్భంలో రామాయణ కవులగురించి కూడా చెప్పకోవచ్చును. గోన బుద్దారెడ్డి రచించిన రంగనాథ రామాయణము మనకు అందిన మొదటి రామాయణం.

ప్రబంధ యుగము - (క్రీ.శ.1510 - క్రీ.శ.1600)

           విజయనగర చారిత్రకశకానికి చెందిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఆదరణలో 16 వ శతాబ్దం ప్రాంతంలో తెలుగు సాహిత్యపు స్వర్ణయుగం వికసించింది.స్వతహాగా కవియైన మహారాజు తన ఆముక్తమాల్యద తో "ప్రబంధం" అన్న కవిత్వరూపాన్ని ప్రవేశపెట్టాడు. ఆ కాలంలో అతి ప్రముఖ కవులైన అష్టదిగ్గజాల తో ఆయన ఆస్థానం శోభిల్లింది.


దాక్షిణాత్య యుగము - (క్రీ.శ.1600 - క్రీ.శ.1820)

          కర్ణాటక సంగీతపు ప్రముఖులెంతో మంది వారి సాహిత్యాన్ని తెలుగులోనే రచించారు. అటువంటి ప్రసిద్దమైన వారి జాబితా లోనివే త్యాగరాజు, అన్నమాచార్య, క్షేత్రయ్య రామదాసు వంటి పేర్లు. మైసూర్ వాసుదేవాచార్ వంటి ఆధునిక రచయితలు కూడా వారి రచనలకు మాధ్యమంగా తెలుగు నే ఎంచుకొన్నారు.

ఆధునిక యుగము - (క్రీ.శ.1820 తరువాత)

        1796 లో మొదటి తెలుగు అచ్చు పుస్తకం విడుదలైనా, తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ 19వ శతాబ్దపు మొదట్లోనే సాధ్యమయింది. 19వ శతాబ్దపు మధ్యప్రాంతంలో , షెల్లీ, కీట్స్, వర్డ్స్వర్త్ వంటి కవుల కవిత్వంచే అమితంగా ప్రభావం చెందిన యువ కవులు "భావకవిత్వం" అన్న సరికొత్త ప్రణయ కవిత్వానికి జన్మనిచ్చారు.

        గ్రాంథిక వ్యావహారిక భాషా వాదాలు నన్నయకు పూర్వమునుండి గ్రాంథిక భాష మరియు వ్యావహారిక భాష స్వతంత్రముగా పరిణామము చెందుతూ వచ్చాయి. కానీ 20 వ శతాబ్దము తొలి నాళ్లలో వీటి మధ్య ఉన్న వ్యత్యాసాలు తీవ్ర వాదోపవాదాలకు దారితీసాయి. గ్రాంథికము ప్రమాణ భాష అని, స్థిరమైన భాష అని, దాన్ని మార్చగూడదని గ్రాంథిక భాషా వర్గము, ప్రజల భాషనే గ్రంథ రచనలో ఉపయోగించాలని వ్యావహారిక భాషా వర్గము వాదించడముతో తెలుగు పండితలోకము రెండుగా చీలినది.

          మొట్టమొదటి నవలగా పరిగణించబడుతూన్న కందుకూరి వీరేశలింగం రచన రాజశేఖరచరిత్రము తో తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ సంపూర్ణమయ్యింది. గ్రాంథిక భాష వాడకాన్ని తీవ్రంగా నిరసిస్తూగిడుగు రామ్మూర్తి ప్రకటించిన ఆంధ్ర పండిత భిషక్కుల భాషాభేషజం ప్రభావంతో గురజాడ అప్పారావు (ముత్యాల సరాలు), కట్టమంచి రామలింగారెడ్డి (ఆంధ్ర విశ్వవిద్యాలయపు వ్యవస్థాపకుడు) (ముసలమ్మ మరణం), రాయప్రోలు సుబ్బారావు (తృణకంకణం) మొదలైన తెలుగుసాహిత్యపు నవయుగ వైతాళికులు వ్యవహారిక భాషను వాడడం వ్యావహారిక భాషా వాదా నికి దారితీసింది.

       19 వ శతాబ్దం వరకూ తెలుగు రచనలు గ్రాంథిక భాషలోనే సాగినాయి, కానీ తరువాత వాడుక భాషలో రచనలకు ప్రాముఖ్యం పెరిగినది. ప్రస్తుతం రచనలు, పత్రికలు, రేడియో, దూరదర్శిని, సినిమాలు మొదలైనవన్నీ కూడా వాడుక భాషనే వాడుతున్నాయి.

No comments:

Post a Comment